'అగ్నిపథ్'పై దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గోపాల్ కృషన్, న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.
వారికి నో ఛాన్స్!
అగ్నిపథ్ పథకం అమలుకు ముందే సాయుధ బలగాలకు ఎంపికైన వారికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల ద్వారా సాయుధ దళాలకు ఎంపికైనంత మాత్రాన.. వారికి ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద నియామకం పొందే అవకాశం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు.. అగ్నిపథ్ అమలుకు ముందు వాయుసేనకు నియామకాలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను మాత్రం సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మూడో పిటిషన్‌పై ఈ నెల 17న వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన వాదనలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నింటినీ విచారించిన దిల్లీ హైకోర్టు.. అగ్నిపథ్ పథకాన్ని సమర్థించింది. జాతీయ భద్రతే ప్రాధాన్యాంశంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారని స్పష్టం చేసింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టేందుకు మార్చి 27న సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. సోమవారం అందులో రెండు పిటిషన్లను కొట్టివేసింది. మూడో వ్యాజ్యంపై వాదనలు ఈ నెల 17న ఆలకిస్తామని తెలిపింది.
అసలేంటి అగ్నిపథ్..?
త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న 'అగ్నిపథ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని తెలిపింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ ఈ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టినప్పటికి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాాగా వెలువడిన సీఆర్ఫీఎప్ నియమాకాల్లోనూ.. అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది ప్రభుత్వం.