దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నేత జయ ఠాకూర్.. ఆ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని ఆమె కోరారు. కాంగ్రెస్ నేత పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ స్వీకరించింది. ఇప్పటికే దాఖలైన రెండు పిటిషన్లతో పాటు జయ ఠాకూర్ పిటిషన్‌పై శుక్రవారమే విచారం జరపనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రపై విచారణ జరిపించాలని కోరారు. లక్షలకోట్ రూపాయిల ప్రజాధనాన్ని మోసం చేసిన అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జయ ఠాకూర్ డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, డీఆర్‌ఐ, సెబీ, ఆర్‌బీఐ వంటి సంస్థలతో విచారణ చేపట్టాలని, అదే సమయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ కేసు విచారణ జరిపించాలన్నారు.
ఆర్‌బీఐ గవర్నర్‌కు జైరాం రమేశ్ లేఖ..
అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలు, షేర్ల మోసపూరిత చర్యల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని రిజర్వుబ్యాంకు, సెబీలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కోరారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, సెబీ ఛైర్‌పర్శన్ మదాబి పురి బుచ్‌లకు లేఖ రాశారు. అదానీ గ్రూపు అధిక రుణం వ్యవహారంలో ప్రస్తుతం, భవిష్యత్‌లోనూ భారత బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని.... శక్తికాంత్ దాస్‌ను కోరారు. ఆ లేఖను జైరాం రమేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అదానీ గ్రూపు తన విదేశీ డమ్మీ సంస్థలతో తమ సంస్థల షేర్లకు అధిక విలువ వచ్చేలా చేసి ఉంటే ఇటీవల జరిగిన ఆ గూపు షేర్ల పతనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని రమేశ్ పేర్కొన్నారు. కాబట్టి ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన ఆర్బీఐని కోరారు. సెబీ ఛైర్‌పర్సన్ బుచ్‌కు రాసిన లేఖను కూడా ట్విట్టర్‌లో జైరాం రమేశ్ పోస్ట్ చేశారు. అదానీ గ్రూపుపై వచ్చిన స్టాక్ అవకతవకల ఆరోపణలపై అనేకమంది భారతీయ మదుపరులు కలతచెందారని ఆయన పేర్కొన్నారు. అదే జరిగి ఉంటే భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్లేనని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సెబీ ఛైర్‌పర్సన్‌ను కోరారు.
హిండెన్‌బర్గ్ వ్యవహారమిదే..
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ.. హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. కాగా, ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.