తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెలుగులోకి మరో భారీ మోసం.. రూ.22,842కోట్లు ఎగ్గొట్టిన ఆ కంపెనీ.. !

ABG Shipyard Scam: నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 28 బ్యాంకులను ఏబీజీ షిప్‌యార్డ్‌ మోసం చేసినట్లు తెలుస్తోంది.

abg shipyard scam
ఏబీజీ షిప్‌యార్డ్‌

By

Published : Feb 12, 2022, 9:57 PM IST

ABG Shipyard Scam: దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీబీఐ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మొత్తం 28 బ్యాంకులను ఏబీజీ షిప్‌యార్డ్‌ మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులు ఉన్నాయి. ఈ కుంభకోణంపై ఇప్పటికే ఎస్‌బీఐ ఫిర్యాదు కూడా చేసింది. ఏబీజీ కంపెనీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.2,925కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.7,089కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.3,634కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.1,614కోట్లు, పీఎన్‌బీ బ్యాంక్‌కు రూ.1,244కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు రూ.1,228కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉందని ఎస్‌బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసులో కంపెనీ డైరెక్టర్లు రిషి అగర్వాల్‌, శంతనం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం రుణాలు తీసుకుని నిధులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పాల్పడ్డారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనట్లు సదరు మీడియా కథనాలు తెలిపాయి.

ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ సంస్థ నౌకల తయారీ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కంపెనీ 165 నౌకలను నిర్మించింది. కాగా.. గతంలోనూ ఈ కంపెనీపై రుణాల ఎగవేత ఆరోపణలు వచ్చాయి.

ఇదీ చూడండి:ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details