కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని మళ్లీ కరోనా బారినపడిన వాళ్లలో 86.09 శాతం మందికి డెల్టా వేరియంట్ సోకినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. టీకా తీసుకున్నవారిలో కరోనా సోకుతుండటంపై ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో తొలిసారి ఈ అధ్యయం చేసింది. కనీసం ఒక డోసు టీకా వేసుకుని కరోనా బారినపడ్డ 677 మంది నమూనాలను విశ్లేషించింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ నమూనాలు సేకరించింది.
కరోనా సోకిన మొత్తం 677 మందిలో 85 మంది టీకా తొలి డోసు తీసుకున్నవారు ఉండగా.. టీకా రెండు డోసులు తీసుకున్నవారు 592మంది ఉన్నారు. వీరిలో 604 మంది కొవిషీల్డ్, 71 మంది కొవాగ్జిన్, ఇద్దరు చైనాకు చెందిన సినోఫార్మ్ టీకాను వేయించుకున్నారు. మొత్తం 71శాతం మంది లక్షణాలు కలిగి ఉన్నారు. 29 మందికి లక్షణాలు లేవు.
"వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆసుపత్రుల్లో చేరడం తగ్గినట్లు తేలింది. డెల్టా వేరియంట్ కారణంగానే టీకా తీసుకున్నవారిలో అధిక శాతం వైరస్ బారినపడ్డారు. 9.8 శాతం అంటే 67మందికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అయింది. 0.4శాతం, అంటే ముగ్గురు చనిపోయారు. డెల్టా ఏవై.1, డెల్టా ఏవై.2 అనే కొత్త రకాలను గుర్తించాం. ఉత్తర ప్రాంతం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తర ప్రాంతంలో ఆల్ఫా, కప్పా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది."