సాధారణంగా ఓ వ్యక్తి మరణించిన తర్వాత సమాధి కడతారు. అదీ వారి కటుంబ సభ్యులో, బంధువులో నిర్మిస్తారు. కానీ ఓ వ్యక్తి తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. మరణించిన తర్వాత ఎవరికీ సమస్యగా మారకూడదని.. అంత్యక్రియలకు అవసరమైన నగదును కూడా సమకూర్చుకున్నాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని చామరాజనగర్లో జరిగింది. నంజదేవనపుర గ్రామానికి చెందిన పుట్టమల్లప్ప అనే వృద్ధుడు 20 ఏళ్ల క్రితమే తనకు నచ్చినట్లుగా సమాధిని నిర్మించుకున్నాడు. దీంతో పాటు అంత్యక్రియలకు అవసరమవుతాయని సుమారు లక్ష రూపాయలను దాచుకున్నాడు.
ధనవంతుడైన పుట్టమల్లప్పకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తన సొంత డబ్బుతోనే అంత్యక్రియలు చేయాలనే ఉద్దేశంతోనే సమాధి నిర్మించుకున్నాడు. ఎవరి డబ్బుతో తన అంత్యక్రియలు జరగకూడదనే ఆత్మగౌరవంతోనే ఆయన ఇలా చేశాడని కుటుంబ సభ్యులు చెప్పారు. గతేడాది కరోనాతో పుట్టమల్లప్ప భార్య మరణించగా.. ఆమె అంత్యక్రియలు సైతం కుమారుల వద్ద నుంచి డబ్బులు తీసుకోకుండానే నిర్వహించాడు. గత 12 రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. 5 రోజుల క్రితం పూర్తిగా మాట్లాడటం ఆపేసినట్లు ఆయన కుమారుడు చెప్పాడు. ఆదివారం సాయంత్రం పుట్టమల్లప్ప మరణించాడు. దీంతో పుట్టమల్లప్ప కోరిక మేరకు ఆయన డబ్బులతోనే అంత్యక్రియలు నిర్వహించారు కుమారులు.