రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమార్తె బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల ఆమె తల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. మరో నాలుగు కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. బాలిక గుండెను ముస్లిం యువకుడికి అమర్చారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో సోమవారం జరిగింది.
అసలేం జరింగిందంటే:ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలికకు రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ధార్వాడ్‌లోని ఎస్డీఎం ఆసుపత్రిలో చేర్చారు. బాలిక బ్రెయిన్ డెడ్ అయిందని ఆమె తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. వెంటనే బాలిక అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు.
బెళగావిలోని కెఎల్ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల ముస్లిం యువకుడు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. వెంటనే బాలిక గుండెను వైద్యులు జీరో ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లో బెళగావిలోని కేఎల్ఈ ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేరుకున్నారు. గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రిచర్డ్ సల్దానా నేతృత్వంలోని బృందం 6 గంటల పాటు శ్రమించి గుండె ఆపరేషన్‌ను పూర్తి చేసింది.