Cobra in Karnataka: పాము ఓ మహిలపై పడగవిప్పి కాసేపు అలానే కూర్చుంది. కానీ ఆ మహిళను కాటు వేయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన కర్ణటకలోని కలబురగి జిల్లాలో జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. కలబురగి జిల్లా అఫ్జల్పుర్ తాలూకా మల్లాబాద్ అనే గ్రామంలో భాగమ్మ అనే మహిళ తన ఇంటి పెరటిలోని చెట్టు కింద నిద్రపోయింది. ఆ సమయంలో నాగుపాము ఆమె పైకి వెళ్లి పడగవిప్పి కాసేపు అక్కడే ఉంది. కానీ, భాగమ్మ ఏమాత్రం భయపడలేదు. ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా కూర్చుంది. కళ్లుమూసుకుని 'శ్రీశైల మల్లయ్య', 'జై మల్లికార్జున', 'స్వామీ గ్వార్దు నన్నప్ప' అంటూ దేవుళ్ల పేర్లు స్తుతించింది. కాసేపటికి పాము ఆమెకు ఏ హాని తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్నవారు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఊరంతా పాములే..
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు దర్శనమిస్తున్నాయి. కొందరిని కాటేశాయి కూడా. గడిచిన పది రోజుల్లో గ్రామంలోని 5 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అశోక్ అనే గ్రామస్థుడూ పాము కాటుతోనే చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాముల బెడద తొలగిపోవాలని ఊరంతా కలిసి పూజలు నిర్వహిస్తున్నారు.