80 Year Old Lady Biker : 80 ఏళ్ల వయసులో ఎవరైనా తమ వాళ్లతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా మరొకరిపై ఆధారపడుతుంటారు. ఎవరూ తోడు లేకపోతే ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో మరికొంతమంది ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా జీవనాన్ని సాగిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా తన బైక్‌పై 600 కిలోమీటర్లు రైడ్ చేసి దైవ దర్శనానికి కూడా వెళ్లారు. చేయాలనే దృఢ సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు.
నీమచ్ జిల్లా మనాస మండలానికి చెందిన సోహన్‌బాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు.. బాబా రామ్దేవ్రాను నిత్యం ఆరాధిస్తుంటారు. అయితే తన స్వస్థలానికి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న బాబా రామ్ దేవ్రా పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న బైక్‌పై బయలుదేరారు. కానీ తనతోపాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. బైక్‌పై ఒంటరిగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాబా రామ్ దేవ్రా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. మార్గమధ్యలో ఆమె పర్యటన గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.