ముంబయి డ్రగ్స్ కేసులో (Cruise Drug ase) ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede news) లంచం అడిగారని వచ్చిన ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చర్యలు ముమ్మరం చేసింది. డ్రగ్స్ కేసుకు చెందిన ఓ సాక్షి చేసిన ఆరోపణలపై విచారణ కోసం ముంబయికి చేరుకున్న ఐదుగురు సభ్యుల విజిలెన్స్ బృందం... సమీర్ వాంఖడేను ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.
విజిలెన్స్ బృందం ముందు హాజరయ్యేందుకు వచ్చిన వాంఖడే.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్పష్టం చేశారు.
'అందరినీ ప్రశ్నిస్తాం'
అంతకుముందు, మీడియాతో మాట్లాడిన ఎన్సీబీ డీడీజీ.. సాక్షులను పిలిచి ప్రశ్నిస్తామని తెలిపారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి రికార్డులను సేకరిస్తామని వెల్లడించారు.
"అఫిడవిట్లో (ప్రభాకర్ సాయిల్) పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులను ఎన్సీబీ కార్యాలయం నుంచి సేకరిస్తాం. విచారణ ప్రక్రియను ప్రారంభించాం. సాక్షులను పిలిచి ప్రశ్నిస్తాం. ఏ ఒక్కరి పేరును నేను ప్రస్తావించదల్చుకోలేదు."
-జ్ఞానేశ్వర్ సింగ్, ఎన్సీబీ డీడీజీ
అదే సమయంలో, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తున్న వరుస ఆరోపణలపైనా వాంఖడే (NCB Sameer Wankhede) విచారణ ఎదుర్కోనున్నారు. ఫోర్జరీ పత్రాల ద్వారా ఎస్సీ కోటా ఉద్యోగాన్ని సంపాదించడం, బాలీవుడ్ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయడం, లంచం డిమాండ్ చేయడం వంటి ఆరోపణలపై ముంబయి పోలీసు విభాగం విచారణకు ఉపక్రమించింది. ఇప్పటివరకు నాలుగు పోలీస్ స్టేషన్లలో వాంఖడేపై కేసులు నమోదయ్యాయని తెలిపింది. వీటిపై దర్యాప్తు చేసేందుకు ఏసీపీ ర్యాంకు అధికారిని నియమించినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:'రాజీనామా అక్కర్లేదు.. చట్టప్రకారమే వాంఖడే ఉద్యోగం పోతుంది'