HIV Blood Transfusion: కొందరి నిర్లక్ష్యం.. ప్రమాదకర వ్యాధితో పోరాడుతున్న నలుగురు చిన్నారుల పాలిట శాపమైంది. ఇప్పటికే తలసేమియా బారినపడిన వారికి కొత్తగా హెచ్ఐవీ సోకింది. ఆ నలుగురు పిల్లల్లో ఒకరు మరణించారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర వైద్యశాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
తలసేమియా ఉందని రక్త మార్పిడి.. నలుగురు పిల్లలకు హెచ్ఐవీ.. ఒకరు మృతి - hiv blood transfusion scandal
HIV Blood Transfusion: బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారులు హెచ్ఐవీ బారినపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగిందీ ఘటన.
రక్త మార్పిడితో.. నలుగురు చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా వారికి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఓ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకొచ్చి వారికి ఎక్కించారు. అయితే.. "పిల్లలకు పరీక్షలు జరపగా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. బ్లడ్ బ్యాంక్ ఇచ్చిన కల్తీ రక్తం ఎక్కించడం వల్ల వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీ సోకాయి. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ఎక్కించే రక్తానికి ఎన్ఏటీ(న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్) చేయించడం తప్పనిసరి. అయితే.. బ్లడ్ బ్యాంక్‌లో ఆ సదుపాయం లేకపోవడం వల్ల పిల్లలు హెచ్ఐవీ బారినపడ్డారు" అని వివరించారు డాక్టర్ విక్కీ రుఘ్వానీ.
ప్రభుత్వం సీరియస్: "నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. పూర్తి సమాచారం సేకరిస్తాం. ఉన్నతస్థాయి విచారణ తర్వాత దోషులపై చర్య తీసుకుంటాం. ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఇకపై తలసేమియా రోగులకు ఇచ్చే రక్తానికి ఎన్ఏటీ పరీక్ష జరిగేలా చూస్తాం." అని స్పష్టం చేశారు మహారాష్ట్ర వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే దకాటే.
గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. తలసేమియాతో బాధపడుతున్న రోగులకు రక్తం ఎక్కించగా.. ఐదుగురు హెపటైటిస్ సీ, ఇద్దరు హెపటైటిస్ బీ బారినపడ్డారు.