మధ్యప్రదేశ్ సాగర్‌లోని ఓ పాఠశాలలో 39 మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో కరోనా టీకా వేశాడు వ్యాక్సినేటర్. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి నిలదీయగా.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కలెక్టర్ రంగంలోకి దిగే సరికి ఆ వ్యాక్సినేటర్ పారిపోయాడు.
మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో..
సాగర్‌లోని జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. 15 ఏళ్లు వయసు పైబడిన 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. అయితే.. టీకాలు వేస్తున్న జితేంద్ర అహిర్వార్.. అందరికీ ఒకే సిరంజీ వాడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించారు. ఇదేంటంటూ వారంతా నిరసనకు దిగారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో తల్లిదండ్రుల నిరసన గురించి జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్‌కు తెలిసింది. వెంటనే ఆయన జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంహెచ్ఓ) డాక్టర్ డీకే గోస్వామిని బడికి పంపారు. ఈలోగా జితేంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాగర్ నగరంలోని గోపాల్ గంజ్ ఠాణాలో జితేంద్రపై ఐపీసీ 366 కింద కేసు నమోదైంది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
వ్యాక్సినేటర్ జితేంద్ర అహిర్వార్ సీఎంహెచ్ఓ నివేదిక మేరకు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. 39 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. 19 మందికి ఏ ఇబ్బందీ లేదని, మిగిలిన వారి వైద్య నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు.