కర్ణాటకలోని బెంగళూరులో రెండు వేర్వేరు చోట్ల ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు కేసు నమోదైంది. బగలకుంటే పోలీస్ స్టేషన్లో పరిధిలో ముగ్గురి ఆచూకీ గల్లంతు అవగా.. సోలాదేవనహళ్లి ఠాణా పరిధిలో మరో నలుగురు కనిపించకుండా పోయారు. ఈ విద్యార్థులు వారంతట వారే ఇళ్లు వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.
అయితే బగులకుంటే ఠాణా పరిధిలో గల్లంతైన వారి ఆచూకీని పోలీసులు సోమవారం కనుగొన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
బగులకుంటే ఠాణా పరిధిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు సోలాదేవానహల్లి ఠాణా పరిధిలో ఇళ్ల నుంచి వెళ్లిపోయిన నలుగురు విద్యార్థులు కారణం ఒక్కటే..
బగులకుంటే ఠాణా పరిధిలోని శేషాద్రి లే అవుట్‌కు చెందిన పరీక్షిత్, నందన్, కిరణ్ అనే ముగ్గురు విద్యార్థులు సౌందర్య స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురికీ చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా ఇంటి నుంచి పారిపోదామని నిశ్చయించుకున్నారు. శనివారం ఉదయం జాగింగ్ అని వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ముగ్గురి ఇళ్లల్లో లేఖలను గుర్తించారు. తమకు చదువంటే ఇష్టం లేదని, క్రీడల పట్ల తమకు ఆసక్తి ఉందని.. ఏదో ఒక క్రీడలో రాణించాకే ఇంటికి తిరిగి వస్తామని లేఖలో పేర్కొన్నారు.
ఎటు వెళ్లాలో తెలియక..
క్రీడల్లో రాణించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన పరీక్షిత్, నందన్, కిరణ్.. మంగళూరుకు వెళ్దామనుకున్నారు. కానీ వారి వద్ద అంత డబ్బు లేదు. ఇద్దరి వద్ద రూ.800 ఉంటే మరొకరి వద్ద రూ.200 ఉన్నాయి. దీంతో కొంత దూరం బస్సు, ఆ తర్వాత రైలులో ప్రయాణించి మైసూరు చేరుకున్నారు. మైసూరులో శనివారం అర్ధరాత్రి వరకు తిరిగి, ఆదివారం ఉదయానికి మళ్లీ బెంగళూరుకు చేరుకున్నారు. విద్యార్థుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ నలుగురు కూడా అంతే..
మరోవైపు సోలాదేవనహళ్లి ఠాణా పరిధిలో నలుగురు విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించి ఇంటికి వస్తామని లేఖ రాసి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వీరిలో ఓ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని కూడా ఉంది. విద్యార్థులను ఏజీబీ లేఅవుట్లోని క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌కు చెందిన అమృతవర్షిణి (21), భూమి (12), చింతన్ (12), రయాన్ సిద్ధాంత (12)గా పోలీసులు గుర్తించారు.
విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి :25 వేల బిస్కెట్లు, కేకులతో అద్భుత కళాఖండం