కరోనా టీకా పొందగలిగే దారి తెలియక మధ్య తరగతి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. టీకా తయారైన కొత్తలో దానిని తీసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాకపోయినా ఇప్పుడు అవగాహన పెరగడం వల్ల ఎగబడుతున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ, ఇటు ప్రైవేటు రంగంలో గానీ ఇవి దొరక్క వారంతా నిట్టూర్పు విడుస్తున్నారు. దేశంలో మధ్య తరగతి ప్రజలు 30-35 కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. కొత్త కొత్త మార్పులతో చెలరేగిపోతున్న వైరస్ కారణంగా రోజుకు రమారమి 4 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తుండడం, వేల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. సాంకేతికతపై అవగాహన ఉన్న వర్గాలు కూడా టీకాలకు స్లాట్లు బుక్ చేసుకోలేక, నేరుగా ఆసుపత్రులకు వెళ్తే పని పూర్తయ్యే దారిలేక అల్లాడిపోతున్నాయి.
వయో వృద్ధుల కోసం మార్చి 1 నుంచి, 45 ఏళ్లు పైబడినవారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించినప్పుడు ఆ అవకాశాన్ని మొదట్లోనే ఉపయోగించు కోనివారు ఇప్పుడు విఫల యత్నాలు చేయాల్సి వస్తోంది.
ఇటీవల గురుగ్రామ్‌లో నడివయస్సు జంట ఒకటి కొవిడ్ సహాయ వాణి (1075) ద్వారా సమాచారం తెలుసుకుని, ఎక్కడా కరోనా బారిన పడకూడదనే జాగ్రత్తతో పీపీఈ కిట్ ధరించి మరీ వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పోర్టల్ ద్వారా ముందుగా బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇస్తామంటూ అధికారులు వారిని తిప్పి పంపించారు. ఇలాంటి అనేక దృష్టాంతాలు 'ఈటీవీ భారత్'దృష్టికి వచ్చాయి.
అన్నిచోట్లా నో స్టాక్
'ఈటీవీ భారత్' బృందం దిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదు మధ్యతరహా, పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించింది. గత నెలాఖరు వరకు వీటన్నిటిలో వ్యాక్సిన్లు దొరికేవి. ఇప్పుడు మాత్రం వీటివద్ద మొదటి డోసు, రెండో డోసులలో ఏదీ అందుబాటులో లేదు. ఆసుపత్రులు బయటే 'నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
కొవిన్ పోర్టల్లో సమాచారం ప్రకారం దిల్లీలో రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే డబ్బు చెల్లించి పొందగలిగే కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయి. గురుగ్రామ్‌లో మాత్రం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. నోయిడాలో మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి వ్యాక్సిన్లు పొందడానికి వీలుంది.