2kg Lump In 5 MonthOld Girl Head : 5నెలల వయసున్న ఓ చిన్నారి తలలో ఏర్పడిన 2 కిలోల కణతిని ఆపరేషన్ ద్వారా విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఈ అరుదైన శస్త్రచికిత్సను రాజస్థాన్ జైపుర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి చెందిన వైద్యులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
'ఒక్క శరీరానికి రెండు తలల్లా'
పాప పుట్టినప్పటి నుంచే ఈ కణతి ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అయితే మొదట్లో చిన్నగా ఉన్న దీని పరిమాణం, క్రమేణా పెరిగిందని వారు తెలిపారు. దీని ఆకారం చూస్తే ఒకే శరీరానికి రెండు తలలు ఉన్నాయా అన్నట్లుగా ఉండేదన్నారు. ఈ కణతి కారణంగా చిన్నారి తన శరీరాన్ని ఎక్కువగా కదిలించలేకపోయేదని, నిద్ర పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేదని ఆమె తల్లిదండ్రులు వివరించారు.
ఇదే విషయమై ఆందోళన చెందిన చిన్నారి కుటుంబం రాజస్థాన్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్‌ఎంఎస్‌ను ఆశ్రయించింది. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమెకు ఆపరేషన్ తప్పనిసరని నిర్ణయించారు. ఆస్పత్రి సీనియర్ ప్రొఫెసర్, డాక్టర్ సంజీవ్ చోప్రా ఆధ్వర్యంలో చిన్నారికి ఆపరేషన్ చేసి కణతిని తొలగించారు. ఆపరేషన్ తర్వాత చిన్నారిని రెండు రోజులపాటు చిన్నపిల్లల ఐసీయూలో ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. కాగా, ఈ కణతి బరువు చిన్నారి శరీర బరువులో 45 శాతంగా ఉండేదని ఆపరేషన్ చేపట్టిన ఎస్ఎంఎస్ ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల వైద్యులు తమ బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారని తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.