రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతా రూపొందించి మహిళకు టోకరా వేశాడు ఓ వ్యక్తి. ప్రీస్కూల్ మహిళా డైరెక్టర్‌తో పరిచయం పెంచుకొని రూ.25 లక్షలు దోచుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
బాధితురాలు సూరత్‌లోని వెసు ప్రాంతంలో ప్రీ స్కూల్ నడుపుతోంది. ఆకాశ్ అంబానీ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకున్న ఓ వ్యక్తికి, ఆమెకు సోషల్ మీడియా ద్వారా స్నేహం కుదిరింది. అయితే, ఐపీఎల్ బెట్టింగ్‌లో కోట్లాది రూపాయాలు పోగొట్టుకున్నానని 'ఫేక్ ఆకాశ్ అంబానీ' ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ డబ్బులు తాను ఇంటి దగ్గర అడిగి తీసుకోలేనని చెప్పి.. కొంత నగదు పంపించమని అడిగాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది.