దిల్లీలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ 20నెలల చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు తల్లిదండ్రులు. ఫలితంగా అవయవాలు దానం చేసిన అతిపిన్న వయస్కురాలిగా ఆ చిన్నారి చరిత్రలో నిలిచిపోయింది.
బ్రెయిన్ డెడ్..
దిల్లీలో నివాసముంటున్న ఆశిశ్ కుమార్ దంపతుల కుమార్తె ధనిష్ట. 20 నెలల ధనిష్ట.. ఈ నెల 8న తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఆమెను తల్లిదండ్రులు దిల్లీ రోహిణిలోని శ్రీ గంగారామ్ ఆసుప్రతికి తరలించారు.
ఈ నెల 11న ధనిష్టకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు వివరించారు. ఆ వార్త విన్న వెంటనే తీరని దుఃఖంలో మునిగిపోయారు.
అదే సమయంలో వివిధ అనారోగ్యాలతో సతమతమవుతున్న వారిని ధనిష్ట తల్లిదండ్రులు చూశారు. తమ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
"ధనిష్టకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు మాకు తెలిపారు. పరిస్థితిని మార్చలేం అన్నారు. తనకు చికిత్స జరుగుతున్న సమయంలోనే.. కొంతమంది రోగుల తల్లిదండ్రులను కలుసుకున్నాం. వారి పిల్లలకు అవయవాలు కావాలని తెలుసుకున్నాం. వారికి మా ధనిష్ట అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదే విషయాన్ని వైద్యులను అడిగాం. అందుకు వారు అంగీకరించారు. నేను, నా భార్య కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. ధనిష్ట శరీరాన్ని ఖననం చేసే బదులు.. ఇలా అవయవాలను దానం చేస్తే.. వారి రూపంలో తను జీవించి ఉంటుంది అని మాకు అనిపించింది."
--- ఆశిశ్ కుమార్, ధనిష్ట తండ్రి.
ఇలా.. అతి పిన్న వయస్సులోనే అవయవాలు దానం చేసిన వ్యక్తిగా ధనిష్ట చరిత్రలో నిలిచిపోయింది.
ధనిష్టకు బ్రెయిన్ డెడ్ అయినా.. ఆ చిన్నారి అవయవాలు మాత్రం ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఫలితంగా.. 20నెలల ధనిష్ట కాలేయం, గుండెను ఇద్దరు పిల్లలకు, ఆమె మూత్రపిండాలను ఓ వృద్ధుడికి ఇచ్చారు. చిన్నారి కంటిలోని రెండు కార్నియాలను భద్రపరిచారు.
ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని.. ధనిష్ట అవయవాలను ఇతరులకు దానం చేసిన ఆమె తల్లిదండ్రులను వైద్యులతో పాటు ఇతరులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చూడండి:-ఈ నెల 31న పల్స్ పోలియో