జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీల నేతలతో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఈ మేరకు 14 మంది నేతలకు ఆహ్వానం పంపినట్లు అధికారులు తెలిపారు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు జమ్ముకశ్మీర్ నేతలతో మాట్లాడారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, సీనియర్ కాంగ్రెస్ నేత గులామ్‌నబీ ఆజాద్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని.. ప్రధాని మోదీతో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
ఇతర నేతలు..
సీపీఎం నేత మహమ్మద్ యూసుఫ్ తరిగామి, జేకేఏపీ చీఫ్ అల్తాఫ్ బుఖారి, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జద్ లోనే, జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్, భాజపాకు చెందిన రవీందర్ రైనా, పాంతర్స్ పార్టీ నేత భీమ్ సింగ్‌నూ ఆహ్వానించినట్లు అజయ్ భల్లా పేర్కొన్నారు.
కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే కానుంది.