UP Mass Weddings: ఉత్తర్ప్రదేశ్లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో శుక్రవారం వేలాది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్లిళ్ల ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ పరిణయాల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమ చేసింది.
లఖ్నవూలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొన్నారు. రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం.. ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. సంభాల్ జిల్లాలో అత్యధికంగా 419 జంటలు ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.