ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణానికి తన వంతు సహాయంగా విరాళాలు సేకరిస్తోంది గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన 11 ఏళ్ల భవిక రాజేశ్ మహేశ్వరి. అయోధ్య సమర్పన్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తోందీ చిన్నారి.
6వ తరగతి చదువుతున్న భవిక.. లాక్డౌన్ సమయంలో తన చదువుతో పాటు భగవద్గీతను అధ్యయనం చేసింది. రామాయణ పఠనంతో రాముడి గొప్పతనం గురించి తెలుసుకున్నానని.. ఆలయ నిర్మాణానికి తనవంతుగా 'రామకథలు' పారాయణం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
రామాయణ కథలను అలవోకగా చెప్పేందుకు తన తాతయ్యలు, తల్లితండ్రుల ప్రేరణే కారణమని భవిక తెలిపింది. మీకున్న దాంట్లో ఎంతోకొంత దానం చేయండి అని విజ్ఞప్తి చేస్తోంది.
రామమందిర నిర్మాణానికి ప్రజలు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. నా కుమార్తె ఇంత చిన్న వయస్సులోనే రామకథలు చెబుతూ విరాళాలు సేకరించటం ఆనందంగా ఉంది. ఇది మాకు గర్వకారణం.
- భవిక తండ్రి