ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికలు ముగియగా.. ఆదివారం కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్ దేశం సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీవైపే ప్రజలు ఉన్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కోసం దేశ ప్రజలు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈసీ ఎంత సమర్థంగా చేపడుతుందనేది సర్వత్రా చర్చనీయంశమైంది.
బంగాల్ దంగల్
- మొత్తం సీట్లు: 294
- మ్యాజిక్ ఫిగర్: 148
- పోలింగ్: 8 విడతలు
- ప్రధాన పోటీ: టీఎంసీ X భాజపా
- మెగా వార్:మమతా బెనర్జీ X సువేందు అధికారి (నందిగ్రామ్)
కఠిన నిబంధనలు...
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 108 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. కేంద్ర బలగాలకు చెందిన 256 కంపెనీలతో పాటు 292 మంది పరిశీలకులను నియమించింది.
ఇదీ చూడండి:-'బంగాల్‌లో ఇప్పటికీ మమతకే ప్రజాదరణ'
కరోనా నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టింది ఈసీ. కరోనా నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. ప్రతి కేంద్రంలో 15 రౌండ్లు శానిటైజేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. మాస్కులు, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్లను కౌంటింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఓట్లను లెక్కించే విధంగా విస్తృత చర్యలు తీసుకుంది.