బ్రిటిష్ దుష్పరిపాలనకు, భూస్వాముల దురాగతాలకు నిరసనగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని కేరళలోని రైతాంగ ఉద్యమం రగులుకుంది. మలబార్ రైతాంగ తిరుగుబాటు అణచివేత, అరెస్టుల పర్వం కొనసాగుతున్న సమయమది. అయినా జనం ఖాతరు చేయలేదు. ఉద్యమం మరింత విస్తృతమైంది. ఆ రోజుల్లో అరెస్టయిన ఉద్యమకారులను తరలించటానికి బ్రిటిషర్లు రైలు గూడ్సు వ్యాగన్లను ఉపయోగించేవారు. 1921 నవంబర్ 20న అలా వందమందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిని మలప్పురంలోని తిరూరు రైలు స్టేషన్లో సరకు రవాణా వ్యాగన్‌లోకి ఎక్కించి .. కర్ణాటకలోని బళ్లారి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మలప్పురం-పాలక్కాడ్ సరిహద్దులోని పులమంతోల్ బ్రిడ్జి పేల్చివేతకు కుట్రపన్నారని అభియోగం మోపారు.
వారందరినీ గాలి, వెలుతురు లేని ఒక గూడ్స్ వ్యాగన్లో కుక్కివేశారు. ఊపిరాడక కేకలు వేయసాగారు. రైలు పాలక్కాడ్ జిల్లాలోని షోర్నూరు, ఒలవక్కోడు స్టేషన్లలో ఆగింది కూడా. కానీ బ్రిటిష్ సైనికాధికారులు వ్యాగన్ తలుపులు తెరవలేదు. ఎట్టకేలకు రైలును తమిళనాడులోని పోత్నూరు స్టేషన్లో నిలిపివేశారు. రైలు బోగీలో ఉంచిన వారి హాహాకారాలు రైలు ప్రయాణిస్తున్న స్టేషన్లన్నింటిలో అధికారులకు వినపడుతూనే ఉన్నాయి. గూడ్సు డబ్బాలోని దాదాపు 70 మంది తమను కాపాడాలంటూ శక్తికొద్దీ కేకలు వేస్తున్నారు. అలా అరుస్తూ.. శ్వాస అందక ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డవారిని బ్రిటిష్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. కర్కశంగా ప్రవర్తించే బ్రిటిష్ సైనికాధికారులే వ్యాగన్ లోపల దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. మృతదేహాలతో కూడిన ఆ వ్యాగన్‌ను రైల్వే అధికారులు తిరిగి పోతన్నూరు నుంచి తిరూరుకు పంపివేశారు. చరిత్రకారులు ఈ ఘోర దురంతాన్ని మరో జలియన్ వాలా బాగ్గా అభివర్ణించారు.
ఊచకోతకు వందేళ్లు..
అమానుష ఊచకోత ఘటనకు వందేళ్లు నిండాయి. అయినా నేటికీ ఆ పీడకల తిరూరును వెన్నాడుతూనే ఉంది. వ్యాగన్లో తీసుకొచ్చిన 44 మృతదేహాలను తిరూరు ఖొరాన్ ఘాట్ జుమా మసీదు సమీపంలో ఖననం చేశారు. మరో 11 మృతదేహాలను కోట్‌లోని జుమామసీదు సమీపాన అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోజు రైలు నుంచి మృతదేహాలను స్వీకరించిన తుంబేరి ఆలికుట్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాడు సైనికులు ఉద్యమకారులను వెంటాడి మరీ అరెస్టు చేశారు. తర్వాత తిరూరు రైల్వే స్టేషన్లో ఓ వ్యాగన్లో కుక్కివేశారు. నలుగురు పోలీసులను కూడా వ్యాగన్‌లోకి ఎక్కించారు.
రైలు కోయంబత్తూరు చేరినప్పుడు.. స్టేషన్ మాస్టరు వ్యాగన్‌ను తెరిచారు. ఓ హృదయవిదారక దృశ్యాన్ని చూశారు. వారిలో అనేకమంది మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి పంపించారు. మృతదేహాల వ్యాగన్‌ను తిరిగి తిరూరుకు పంపించారు.
తీసుకునేందుకు ఎవరూ రాలేదు..
మృతదేహాలు వెనుదిరిగి వచ్చినప్పుడు తిరూరులో వాటిని తీసుకునేందుకు సంబంధీకులెవరూ రాలేదు. చిట్టచివరకు ఎల్నాడు కనిక్కర మమ్మిహాజీకి చెందిన కమ్ముకుట్టియక్క స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.