ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శాసన మండలి రద్దుకు మంత్రి వర్గం ప్రతిపాదన

అనుకున్నదే అయ్యింది. గత కొన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలను ప్రభుత్వం నిజం చేసింది. రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను మండలి ఛైర్మన్ సెలక్టు కమిటీకి పంపిస్తామని ప్రకటించినప్పటి నుంచి మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. స్వయంగా సీఎం జగన్.. అసెంబ్లీలో మండలి రద్దు అంశాన్ని ప్రస్తావించారు.   మండలి రద్దు ప్రధానాంశంగా ఇవాళ భేటీ అయిన కేబినెట్.. మండలి రద్దుకు పచ్చజెండా ఊపింది. శాసనసభలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రద్దు వ్యవహారాలను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం తలుస్తుంది.

cabinet approves legislative council abolish
శాసన మండలి రద్దుకు మంత్రి వర్గం ప్రతిపాదన

By

Published : Jan 27, 2020, 11:46 AM IST

Updated : Jan 27, 2020, 1:15 PM IST

శాసన మండలి రద్దుకు మంత్రి వర్గం ప్రతిపాదన

శాసనమండలి రద్దు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. శాసనసభలో మండలి రద్దు సంబంధిత తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలోనూ ఆమోదించిన తర్వాత వెంటనే కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. మండలిలో సభ్యులుగా ఉన్న మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

మండలిపై వేటుకే నిర్ణయం

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపినందున ఆగ్రహంగా ఉన్న వైకాపా సర్కారు... ఏకంగా మండలి రద్దుకే మొగ్గు చూపింది. శాసన సభలో ఆమోదించిన బిల్లులు మెజారిటీ లేనందున మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం.... సర్కారుకు మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే శాసనసభ వేదికగా సభ్యులు, మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. న్యాయ నిపుణులతోనూ చర్చించిన సీఎం.. మండలిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఇవాళ మంత్రివర్గ సమావేశంలో తుదినిర్ణయం తీసుకున్నారు.

ఫలించని ఎమ్మెల్సీల ఆకర్ష ప్రయత్నం

ప్రజాభిప్రాయానికి, చట్టసభల నిబంధనలకు ప్రజల శాసనసభకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న శాసన మండలి అవసరమా అంటూ ఇటీవలే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మండలి రద్దుపై మంత్రుల అభిప్రాయాలను గురువారం తీసుకున్నారు. అనంతరం 3 రోజులు గడువిస్తూ సోమవారానికి శాసనసభను వాయిదా వేశారు. పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా రద్దుకే సీఎం మొగ్గు చూపారు. తెదేపా ఎమ్మెల్సీలు తమవైపు వస్తారనే అంచనాతో 3 రోజులపాటు శాసన సభను వాయిదా వేసి వేచి చూశారు. తెదేపా ఎమ్మెల్సీలను రాబట్టుకునేందుకు వైకాపా నేతలు పలు రకాలుగా ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు.

మంత్రులకు రాజ్యసభ సభ్యత్వం..?

శాసన, న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిగణలోకి తీసుకొని, తదుపరి ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించుకున్న తర్వాతే కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో అధికార వైకాపాకు 9 మంది సభ్యులున్నారు. అందులో ఇద్దరు మంత్రులు సైతం ఉండగా... ఒకరికి ఉపముఖ్యమంత్రి హోదా ఉంది. మండలిలో సభ్యులుగా ఉన్న వారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే దిశగా వైకాపా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఒప్పందం మేరకు ఆ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మిగతా ఏడుగురు సభ్యులకూ రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లకు ఛైర్మన్‌ పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

కేబినేట్​లో ఇతర నిర్ణయాలు

మరోవైపు కడప ఆర్‌అండ్‌బీ స్థలంలోని తెదేపా కార్యాలయ లీజు రద్దుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చినజీయర్‌ మఠానికి విజయ కీలాద్రిపై 40 ఎకరాల భూమి కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి:

'ప్రజావేదిక కూల్చినట్లు కాదు..శాసన మండలి రద్దు చేయడం'

Last Updated : Jan 27, 2020, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details