Air India NDC Bookings :ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ 'ఎయిర్ ఇండియా' (Air India) సిద్ధమైంది. టికెట్ బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) సాయంతో 'న్యూ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ' (ఎన్‌డీసీ) సాంకేతికతను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. దీనితో ఎన్‌డీసీ టెక్నాలజీతో టికెట్ బుకింగ్ సర్వీసులు తీసుకొచ్చిన తొలి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచింది.
'ఎయిర్ ఇండియా' టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత ఈజీగా!
Air India (ANI)
Published : Sep 6, 2024, 12:12 PM IST
ఎయిర్ ఇండియా ఆఫర్స్, డీల్స్, యాడ్-ఆన్స్ సహా అనుకూలమైన ప్యాకేజీల పూర్తి వివరాలు ఇకపై టికెట్ బుకింగ్ సమయంలోనే దర్శనమిస్తాయి. దీనితో చాలా సమయం ఆదా అవుతుంది. బుకింగ్ మరింత పారదర్శకంగా మారుతుంది. ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఎన్‌డీసీ కస్టమర్ సపోర్ట్ సాయంతోనూ ఈ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.