గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి - దేశీయ పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు
Published : Jul 30, 2024, 2:15 PM IST
PM Modi To India Inc :ప్రపంచ పెట్టుబడిదారులందరి చూపు ఇప్పుడు భారత్ వైపే ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత పారిశ్రామిక రంగం ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకొని 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాకారం చేయడంలో తమవంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ‘వికసిత భారత్ దిశగా ప్రస్థానం’ అంశంపై మోదీ ప్రసంగించారు. ‘‘మా ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ ఎజెండా ఉండదు. ప్రతీ నిర్ణయాన్ని దేశ ప్రయోజనాలే పరమావధిగా తీసుకుంటాం. నేషన్ ఫస్ట్ పాలసీతో ముందుకు సాగుతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధితో పురోగమిస్తోంది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, మూడో స్థానానికి చేరే రోజులు ఎంతో దూరంలో లేవు. నా ప్రస్తుత మూడో టర్మ్‌లోనే ఇది జరిగినా జరగొచ్చు’’ అని మోదీ అన్నారు.