దిల్లీలో ధర్నాకు తరలిరావాలి- పార్టీ నేతలతో వైఎస్ జగన్ - YSRCP Parliamentary Party meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 10:46 AM IST
|Updated : Jul 21, 2024, 11:49 AM IST
YSRCP Parliamentary Party Meeting: దిల్లీలో ఈనెల 24న నిర్వహించే ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కోరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జగన్, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను దేశం దృష్టికి తీసుకేళ్లేందుకే దిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో వారికి వివరిస్తామన్నారు. ధర్నా తర్వాత, పార్టీ ఎంపీలు పార్లమెంట్లో తమ గళం వినిపించాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్లు కోరామన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారన్నారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపైనా దాడులు చేశారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టంచేశారు.