ఆ దాడితో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సంబంధం లేదు : పేర్ని నాని - YSRCP Leaders Visit Sub Jail
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 4:34 PM IST
YSRCP Leaders Visit Accused Remand in TDP Office Attack Case : గన్నవరం తెలుగుదేశం కార్యాలయ దాడి కేసులో రిమాండ్లో ఉన్న నిందితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నూజివీడు సబ్ జైలులో ఉన్న నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ ఘటన జరిగిన సంవత్సరం తర్వాత అక్రమంగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని పేర్ని నాని ఆరోపించారు. అమాయకులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు దాడి ఘటనకు సంబంధంలేదన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పేర్ని వెల్లడించారు.
టీడీపీ కార్యాలయ దాడి కేసుపై గత నెల 24న న్యాయస్థానం విచారణ జరపగా నిందితులకు మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగించింది. అంతకుముందు రిమాండ్ విధించిన న్యాయస్థానం గడువు ముగియడంతో స్థానిక కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ తీర్పును ఇచ్చింది. నిందితులను మళ్లీ నూజివీడు సబ్ జైలుకు పోలీసులు తరలించారు.