Temperatures Rise in AP : ఏపీలో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితేంటని హడలిపోతున్నారు. భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది.
ఈనెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ భావిస్తోంది. మంగళవారం మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, తుని, నరసాపురం, కాకినాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు రోజుల్లో రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు, కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది.
వేడితో ముప్పే :
- 2010-2024 మధ్యకాలంలో పది సంవత్సరాలు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించాయి.
- 2015-2024 అత్యంత వేడి దశాబ్దంగా నిలిచింది. సగటున 0.31 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది.
- సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే మరణాల శాతం 0.2 శాతం నుంచి 5.5 శాతం పెరిగే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి.
- ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
సముద్రాలు కలుషితమై : గ్రీన్ హౌస్ వాయువుల (కార్బన్ డయాక్సైడ్, మీథేన్ తదితరాలు) ప్రభావంతో ఏటికేడు రికార్డు స్థాయిలో వేడి పెరుగుతోందని వాతావరణ నిపుణులు ఆచార్య భానుకుమార్ తెలిపారు. ఈ కారణంగా భూతాపం పెరుగుతోందని వివరించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం కూడా ఒక కారణమని చెప్పారు. సాధారణంగా సముద్రాలు 30 శాతం కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని అన్నారు. సముద్రాలు కూడా కలుషితం కావడంతో ఆ ప్రక్రియ సరిగా జరగట్లేదని పేర్కొన్నారు. ఈసారి మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ తొలి వారం నుంచే వడగాలులు వీచే అవకాశముందని ఆచార్య భానుకుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో) :
ప్రాంతం | సాధారణం | నమోదు |
నందిగామ | 32.2 డిగ్రీలు | 38.4 డిగ్రీలు |
కర్నూలు | 33.3 డిగ్రీలు | 37.2 డిగ్రీలు |
మచిలీపట్నం | 29.8 డిగ్రీలు | 35.8 డిగ్రీలు |
బాపట్ల | 29.9 డిగ్రీలు | 35.4 డిగ్రీలు |
తుని | 30.7 డిగ్రీలు | 35.4 డిగ్రీలు |
కావలి | 30.6 డిగ్రీలు | 35 డిగ్రీలు |
నరసాపురం | 29.5 డిగ్రీలు | 34.5 డిగ్రీలు |