ఉరవకొండలో వైఎస్సార్సీపీని వీడుతున్న శ్రేణులు- టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు - ycp to tdp
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 12:27 PM IST
YCP Leaders Joined TDP Party in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని వీడుతున్న కుటుంబాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వజ్రకరూరు మండలం పందికుంట, ఉరవకొండ మండలం నింబగల్లులో వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న పలు కుటుంబాలు ఈరోజు(ఆదివారం) తెలుగు దేశం పార్టీలో చేరాయి. వీరందరికి ఉరవకొండ పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీమీద నమ్మకంతో వచ్చిన వీరందరికీ రాబోయే రోజుల్లో సముచిత స్థానాన్ని కల్పిస్థామని తెలిపారు.
ఉరవకొండ నియోజకవర్గంలో వైైసీపీ నాయకుల అరాచకాలు మితిమీరిపోయాయి. వాటిని చూడలేకనే పార్టీని వీడామని శ్రేణులు తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఇప్పటి నుంచి తాము ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి పయ్యావుల కేశవ్ గెలవటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.