గత ఐదేళ్లలో ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయలేదు: వైఎస్ షర్మిల - SHARMILA FIRE ON JAGAN - SHARMILA FIRE ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 9:09 AM IST
YS Sharmila Inspected Flood Affected Crops: తన పార్టీ కార్యకర్త చనిపోయారని, దిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి, గత ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం కోసం ఎందుకు ధర్నా చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎర్రకాలువ ఉద్ధృతి కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరులో నీట మునిగిన పంట పొలాలను షర్మిల పరిశీలించారు. నడుం లోతు నీళ్లలో దిగిన షర్మిల, రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని, వారిని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం మాట అటుంచితే కనీసం మరమ్మతులు కూడా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేసేదని, చంద్రబాబు హామీ ఇవ్వకపోయినా రుణ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత హోదా కోసం పాకులాడుతున్న జగన్, రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం మానేసి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను పరామర్శించే బాధ్యత జగన్పై లేదా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడైనా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టి, వచ్చే ఏడాదికైనా ముంపు లేకుండా చూడాలని కోరారు.