టీడీపీ బూత్ కన్వీనర్‌పై వైసీపీ సర్పంచ్ దాడి- చంపుతామని బెదిరింపులు - కన్వీనర్‌పై వైసీపీ సర్పంచ్ దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 8:42 AM IST
YCP Sarpanch Attack on TDP Booth Convener: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం తంబాపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బూత్ కన్వీనర్ శివశంకర్‌పై వైసీపీ సర్పంచ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. టీడీపీ బూత్ లెవల్ కన్వీనర్ శివశంకర్ పై సర్పంచ్ జయచంద్రారెడ్డి, అతని సోదరులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. గ్రామంలోని బీసీ కాలనీలో "బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమాన్ని చేస్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని శివశంకర్ తెలిపారు. గ్రామంలో వైసీపీ తప్ప వేరే పార్టీ ఉండకూడదు అంటూ సెల్ ఫోన్ లాక్కొని సర్పంచ్ అతని వర్గీయులు శివశంకర్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. గాయపడిన శివశంకర్‌ను బంధువులు బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చేర్పించారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు తరలివెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి అతని సోదరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. తనని చంపుతామని బెదిరించారని శివశంకర్ వాపోయారు. స్థానిక వైసీపీ సర్పంచ్ ఆయన సోదరులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు చర్యలు తీసుకోవాలని శివశంకర్ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు