గుంతల రోడ్డులో ప్రయాణం - ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు - ఉడిపోయిన బస్సు చక్రాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 9:00 PM IST
Wheels separated while RTC Bus: గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రోడ్లను ఊహించుకోవడం కష్టం. ఏపీలో గుంతలు లేని రోడ్డుపై ప్రయాణించాలని అనుకున్నారంటే భ్రమే ! అడుగుకో గుంత, అడిగితే తంటా అన్నట్లు తయారైంది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి. తాజాగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడగా డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నుంచి శాంతి ఆశ్రమానికి నిత్యం ప్రయాణికులను తీసుకెళ్లే ఆర్టీసీ బస్సు, ఎప్పటిలాగే ప్రయాణికులతో బయలుదేరింది. రోడ్డుపై ఉండే గుంతల పరిస్థితి తెలిసిన డ్రైవర్ రోజు మాదిరిగానే, బస్సును నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు. అయితే, అర్టీసి బస్సు సామర్లకోట, వి కె రాయపురం ప్రధాన రహదారిపై వెళ్తుండగా బస్సు వేగంలో వచ్చిన మార్పులను డ్రైవర్ పసిగట్టాడు. మరి కొంత దూరం వేళ్తే బస్సు చక్రాలు ఉడిపోతాయనేలోగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. ఆర్టీసీ డ్రైవర్ బస్సును చాకచక్యంగా పక్కకు ఆపాడు. బస్సు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో మెుత్తం 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చక్రాలు ఊడిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గర్లో ప్రధాన రహదారిపై ఓవైపు కెనాల్ మరోవైపు పంట కాలువలు ఉన్నాయి.