ఎండాకాలమే కాదు - జగనన్న పాలనలో ఐదేళ్లూ నీటి కొరతే - Water Problems in Annamayya
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 6:55 PM IST
Water Problems in Annamayya District : అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని ఏసీ గార్డెన్ ఊర్లో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2005-2008 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ కాలనీ నిర్మించారు. కాలనీలో వేసిన తాగునీటి బోరు బావుల్లో నీళ్లు అడుగంటాయి. గత ఐదేళ్లుగా ఈ కాలనీ వాసులకు తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు ఆ కాలనీకి వెళ్లి నీటి సమస్య తీరుస్తామని, పక్కనే ఉన్న పురపాలక నుంచి తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ ఐదేళ్లుగా అమలుకు నోచుకోలేదు. దీంతో ఆ ప్రాంతవాసులు తాగునీటి కోసం పడని కష్టాలు లేవని వాపోతున్నారు
అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసుల ఆందోళనకు దిగారు. స్పందించి గతంలో ఒక ట్యాంకర్ నీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నా ఆ ట్యాంకర్ రెండు, మూడు రోజులకు ఒక సారి నీరందించేది. ఆ నీరు సరిపోకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి ట్యాంకర్‌కు రూ.600 పెట్టి కొనుగోలు చేసి సంపులు నింపుకుంటున్నారు.