ఎంపీ బాలశౌరితో వంగవీటి రాధా భేటీ- జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ! - Vangaveeti Radha Meet MP Balasouri
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 10:41 AM IST
Vangaveeti Radha Meet MP Vallabhaneni Balasouri: ఎన్నికల(AP Elections 2024) సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గుంటూరులో జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ కలిశారు. దాదాపు గంట పాటు వీరిరువురి భేటీ జరిగింది.
వంగవీటి రాధా జనసేనలో చేరతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. అందుకు బలం చేకూరుస్తూ తెనాలిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Janasena PAC Chairman Nadendla Manohar)ని కలిసిన రాధా, బాలశౌరితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించారు. అక్కడ బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వంగవీటి రాధా జనసేనలో చేరి అవనిగడ్డ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.