రోడ్లపై వాహనాలు పార్కింగ్ - భారీగా ట్రాఫిక్ జామ్ - సీఎం పర్యటనతో ప్రజలకు తిప్పలు - jagan meeting in phirangipuram
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 5:01 PM IST
Traffic Jam due to CM Jagan Meeting: గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాధారణ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెట్టింది. వాలంటీర్లకు వందనం (Volunteerlaku Vandanam Program) సభ కోసం ముఖ్యమంత్రి ఈ రోజు ఫిరంగిపురం వచ్చారు. ఆ సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు. ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా తరలింపు చేపట్టారు. ఆ వాహనాలను తెనాలి మండలం అంగలకుదురు - సంగం జాగర్లమూడి మధ్య ఆపివేశారు. అక్కడ వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయటంతో వాహనాలన్నింటినీ రోడ్డుపైనే ఆపివేశారు.
People Face Problems with Jagan Tour: దీంతో ఆ మార్గంలో ఇతర వాహనాలన్నీ ఆగిపోయి 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ట్రాఫిక్ జాంలో ఓ అంబులెన్స్ (Ambulance) కూడా ఇరుక్కుపోయింది. వాహనాలు ఆ ప్రాంతంలో గంటకు పైగా ఆగిపోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వాహనదారులే వీలు చూసుకుని ముందుకు కదిలారు. భోజనాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్‌కు కూడా ఏర్పాట్లు చేసుకుంటే సమస్య వచ్చేది కాదని ప్రయాణికులు మండిపడుతున్నారు. అధికారులు జనాల్ని తరలించటంతో చూపిన శ్రద్ధ సాధారణ పౌరులకు కలిగే ఇబ్బందులపై దృష్టి పెట్టకపోవటంతో సమస్య తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.