సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి- కార్మిక సంఘాల డిమాండ్ - TRADE UNION LEADERS DEMANDS - TRADE UNION LEADERS DEMANDS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 7:36 PM IST
Trade Union Leaders Demands on Ultratech Cement Factory Incident : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన భారీ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పలు కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రమాదానికి కారణమైన ప్లాంట్‌లో లీకేజీ గురించి కార్మికులు గత 20 రోజులుగా అక్కడి అధికారులకు చెబుతూనే ఉన్నారని తెలిపారు. అయిన అక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే భారీ ప్రమాదం సంభవించిందన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుని, బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో, సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలెన్ విభాగంలో ట్యాంకు పగలడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. ముడి పదార్థాన్ని పంపుతూ వేడి చేసే పైపులైన్ మాదిరిగా ఉండే ట్యాంకు కింది భాగం ఊడిపోయింది. దీంతో 200 డిగ్రీలపైగా వేడితో ఉన్న పొడి కిందకు పడింది. ఇది విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడటంతో వారి శరీరమంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. జూలై 7 న జరిగిన ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.