LIVE : తిరుమల బ్రహ్మోత్సవాలు - మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం - TIRUMALA MOHINI AVATHARAM
Published : Oct 8, 2024, 8:14 AM IST
|Updated : Oct 8, 2024, 10:14 AM IST
Tirumala Mohini Avatharam Live : గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా కూడా స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. ప్రపంచమంతా మాయా విలాసమని.. తన భక్తులు కానివారు మాయాధీనులు కాకతప్పదని స్వామివారు బోధించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు. మాడ వీధుల్లో భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది.
Last Updated : Oct 8, 2024, 10:14 AM IST