ఏలూరి జిల్లాలో మరోసారి పులి కలకలం - జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన - ఏలూరులో పులి అడుగుజాడలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 10:19 AM IST
|Updated : Feb 20, 2024, 1:30 PM IST
Tiger HulChul in Eluru : ఏలూరు జిల్లాలో పులి అడుగు జాడలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పాపికొండల అభయారణ్యంలోనికి వెళ్లిన పులి తిరిగి మైదాన ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. జిల్లాలోని పోలవరం మండలం గుంజవరం సమీపంలోని మొక్క జొన్న చేలల్లో పులి పాదముద్రలను గుర్తించిన స్థానిక గిరిజనులు ప్రగడపల్లి సర్పంచి కలుం బాపిరాజుకు చెప్పడంతో ఆయన పోలవరం అటవీ శాఖాధికారికి సమాచారం ఇచ్చారు. జొన్న చేలతో పాటు పరిసరాలను పరిశీలించి పులి వచ్చినట్లు గుర్తించారు.
Tiger FootPrints in Eluru : ఇటీవల బుట్టాయగూడెం మండలం ముంజులూరు అటవీ ప్రాంతంలో లేగదూడను చంపిన పులి వెనక్కి తిరిగి కుంకాల, వింజరం అడవుల్లో సంచరించి మొక్కజొన్న చేలల్లోకి ప్రవేశించినట్లు అడవి శాఖ అధికారులు పేర్కొన్నారు. స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, పశువుల వద్ద దీపాలు ఎక్కువగా పెట్టాలని అటవీ శాఖాధికారి ఎం. దావీద్ రాజు సూచించారు. పులి రాకపోకలు పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. పులి పాదముద్రలు 17 సెంటీమీటర్ల పొడవు 15 సెంటీమీటర్లు వెడల్పు ఉందని, పాదముద్రలను బట్టి మగపులిగా నిర్ధారణకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.