రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు - రాబోయే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు - temperatures raising extreme
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 7:26 AM IST
Temperatures Raising Extreme in AP : తీవ్ర వడగాల్పుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా బనగానపల్లె, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా పంచలింగాల, కడప జిల్లా వల్లూరులో 45.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లా తర్లపాడులో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో 44.6 డిగ్రీలుగా ఉండగా నెల్లూరు జిల్లా గోనుపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తరిమెలలో 44.3 డిగ్రీల నమోదుకాగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడింది.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 124 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణిపై వడగాల్పులు వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు మూడు రోజుల్లో చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.