దళితులపై వైసీపీది కపట ప్రేమ: టీడీపీ - దళితులపై వైసీపీ కపట ప్రేమ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 7:56 PM IST
TDP Leaders Protest in Gannavaram: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగబద్ద పాలన చేయకుండా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని గన్నవరంలో టీడీపీ దళిత నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం నాలుగున్నర సంవత్సరాల కాలంగా జగన్ పాలన కొనసాగిెందని నేతలు మండిపడ్డారు.
పార్టీ నాయకుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ఓ ఆత్మకూరుకు చెందిన దళితుడిని ఏ1గా చూపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగబాబుపై దాడి చేయించింది ఎమ్మెల్యే వంశీ అని అందరికీ తెలుసన్నారు. కేసుతో ఎటువంటి సంబంధం లేని చిరంజీవి అనే దళితుడిని నిందితుడిగా చూపడం వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారు. సంబంధం లేని ఎస్సీ వ్యక్తి చిరంజీవిని కేసులో ఇరికించి అసలు నిందితులను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులంటే పోలీసులు, ప్రభుత్వానికి మరీ ఇంత చిన్నచూపా అని ప్రశ్నించారు. సెక్షన్లను మార్చి ఎమ్మెల్యే వంశీకి అనుచరుల్లా పోలీసులు వ్యవహరించిన తీరుపై నేతలు మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దళితులపై వైకాపా కపట ప్రేమ ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు.