గుంటూరు మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత పెమ్మసాని ఫైర్ - Rosaiah Bronze statue in guntur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 10:24 PM IST
TDP Leader Pemmasani Chandrasekhar Fire on YCP Government : గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీకి ఒకలా ఇతర పార్టీలకు మరోలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కోసం వైశ్య సంఘాల తరపున మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని టీడీపీ నాయకులు సొంత డబ్బులతో శనివారం రోజు స్థంబాలగరువులో ఏర్పాటు చేయలని సంకల్పించారు. కానీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రశేఖర్ మండిపడ్డారు. విగ్రహా ఏర్పాటు విషయంలో అధికారులు అడ్డుకోవడంతో శనివారం అర్థరాత్రి వరకూ ఆందోళనలు కొనసాగాయి.
రోశయ్య విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్లో తీర్మానం చేసినా అధికారులు అడ్డుకోవటంపై తీవ్ర విమర్శలు చేశారు. చివరికి ఆర్యవైశ్యులు, టీడీపీ నాయకుల ఆందోళనతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ నాయకులు రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. నేడు పెమ్మసాని చంద్రశేఖర్ స్థంబాలగరువు ప్రాంతానికి చేరుకొని రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గుంటూరు నగరంలో వైసీపీ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్డగోలుగా విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటే పట్టించుకోని అధికారులు ఇతరుల విషయంలో మాత్రం ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు.