బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్- సత్వర చర్యలకు మంత్రి ఆదేశం - food poisoning at girls hostel - FOOD POISONING AT GIRLS HOSTEL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 9:12 PM IST
|Updated : Jun 26, 2024, 10:15 PM IST
Students Suffered from Food Poisoning in Anantapur District : బాలికల గురుకులం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 60 మంది విద్యార్ధినులు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులం పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గురుకులంలో సోమవారం ఉదయం విద్యార్ధులు ఉదయం అల్పహారంగా పులిహోర తిన్నారు. తిన్న కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం బయటకు రానివ్వకుండా ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అస్వస్థత చెందిన విద్యార్థులను హాస్టల్లోనే ఉంచి వైద్యులను అక్కడికే పిలిపించి చికిత్స అందించారు.
అనంతరం 40 మంది విద్యార్థులను ఇంటికి పంపించారు. మరి కొంతమందిని హాస్టల్లోనే ఉంచి గోప్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈరోజు విషయం తెలుసుకున్న గురుకులం పాఠశాల డీసీఓ మురళీకృష్ణ హుటాహుటిన బాలికల హస్టల్కి వెళ్లి విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా హాస్టల్లో ఎక్కడ చూసిన అపరిశుభ్రత తాండవస్తొందని విద్యార్థినులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయని, విద్యార్థుల హాస్టల్ పరిసరాల్లో శుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ ఇది వరకే ఆదేశాలు జారీచేశారు. అయిన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పందించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి, వసతిగృహంలో తాగునీటి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.