పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారు - వారిని కఠినంగా శిక్షించాలి: శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati fire jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2024, 4:04 PM IST
Srinivasananda Saraswati Fire on Previous YSRCP Government : తిరుమలను హిందువులకు దూరం చేసేందుకు గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన జగన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డిని చట్టప్రకారం శిక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రక్షాళన చేస్తున్నారంటూ అభినందించారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన తిరుమల వేంకటేశ్వరుడిని ఆపచారం చేసి, తిరుమల క్షేత్రాన్ని పాడుచేసి హిందువులను దూరం చేసే కుట్ర జగన్ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపించారు.
ఎంతో పవిత్రమైన స్వామివారి లడ్డూను అపవిత్రం చేసేందుకే జంతువుల కొవ్వును వాడినట్లు NDDB రిపోర్టు ద్వారా బయటకు వచ్చిందని వివరించారు. ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడ అని చాలా మంది విమర్శలు చేయొచ్చు, కానీ ఎంతో పేరున్న NDDB సంస్థ రిపోర్టును ఎలా రాజకీయంగా వర్ణిస్తామన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు? తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టాల్సిందేన్నారు. తిరుమల క్షేత్రం ఒక ధార్మిక సంస్థగా కాక వ్యాపార సంస్థగా గత ఐదేళ్లు కొనసాగిందని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు.