శంబర పోలమాంబ సిరిమానోత్సవం - అమ్మవారిని దర్శించుకున్న వేలాది భక్తులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 9:29 PM IST
Sambara Polamamba Jatara Sirimanotsavam: శంబర పోలమాంబ జాతర సిరిమానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతర ముఖ్య ఘట్టం సిరిమానోత్సవం కార్యక్రమం మంగళవారం జరిగింది. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వేయడం వలన భక్తులకు ఎటువంటి అంతరాయం కలగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
అంతేకాకుండా డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ గతేడాది ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో సిరిమానోత్సవాన్ని ఘనంగా జరిపారు. సిరిమానోత్సవం కార్యక్రమం ప్రతి ఏడాది మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ప్రారంభం అయ్యేది. కానీ ఈసారి సుమారు మూడు గంటల ముప్పై అయిదు నిమిషాలకు సినిమానోత్సవం ప్రారంభం అయ్యింది. సిరిమానోత్సవం కార్యక్రమానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు.