సండే ఎఫెక్ట్ - భద్రాద్రి, కొమురవెల్లి ఆలయాల్లో భక్తుల రద్దీ - భద్రాద్రి పెరిగిన భక్తుల రద్దీ
Published : Feb 4, 2024, 12:57 PM IST
Rush At Bhadradri Temple : ఆదివారం సెలవు కావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి ఆలయానికి భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్దకు కదలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు, అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. నిత్య కల్యాణ వేడుకలో ఉభయ దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Huge Rush At Komaravelli Temple : ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోనూ రద్దీ నెలకొంది. జాతరలో భాగంగా మూడో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.