"స్పెషల్ డీఎస్సీ ద్వారా ప్రత్యేక ఉద్యోగాలు లేనప్పుడు - టెట్ 1బీ, 2బీ ఎందుకు నిర్వహించారు" - స్పెషల్ డీఎస్సీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 6:48 PM IST
Protest on Special DSC: స్పెషల్ డీఎస్సీ ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయ ఉద్యోగాలు లేనప్పుడు, స్పెషల్ టెట్ 1బీ, 2బీ పేపర్స్ ఎందుకు నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టీచర్ ఫోరమ్, నిరుద్యోగ ప్రత్యేక టీచర్ల ఫోరమ్ ప్రశ్నించింది. ఖాళీగా ఉన్న 6 వేల 800 ప్రత్యేక టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాకుండా 800 మంది ప్రత్యేక టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిరసన చేపట్టారు.
2022 టెట్లో నూతనంగా 1బీ, 2బీ అనే పేపర్లను చేర్చి ప్రత్యేక టెట్ పరీక్షను నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఎస్జీటీ అభ్యర్థులకు పేపర్ 1బీ అని, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పేపర్ 2బీ అని పరీక్ష నిర్వహించారని వివరించారు. స్పెషల్ టీచర్ పోస్టలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ అవసరమని నోటిపికేషన్ జారీ చేసిందన్నారు. కానీ, డీఎస్సీలో ఎటువంటి ప్రత్యేక ఉపాధ్యాయ ఖాళీలను పొందుపరచలేదని ఆరోపించారు. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండానే ప్రత్యేక టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.