ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరదలో చిక్కుకున్న గర్భిణీ - ప్రాణాలకు తెగించి కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్​ బృందం - Police Saved Pregnant Woman

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 12:43 PM IST

Police Saved Pregnant (ETV Bharat)

Police Saved Pregnant Woman in Alluri District : గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం అతలాకుతలమైంది. అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించి అభినందనలు అందుకున్నారు. మండల కేంద్రానికి చెందిన ముత్యాల భవానీకి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త సాయిరామ్‌ ఆమెను రేఖపల్లి వైద్యశాలకు తరలించారు. ప్రసవానికి వైద్యుడు అనిల్‌కుమార్‌ ఏర్పాట్లు చేస్తుండగా అధిక రక్తస్రావం జరగడం గుర్తించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కోతులగుట్ట వైద్యశాలకు తరలించాలని సూచించారు. 

ఎన్​డీఆర్​ఎఫ్​ సాహసం : వరదల కారణంగా అక్కడకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో రాత్రి ఒంటిగంట సమయంలో తహసీల్దార్‌ మౌలానా ఫాజిల్, ఎటపాక సీఐ రామారావుకు సమాచారం అందించగా అక్కడికొచ్చిన వారు నాటు పడవలు నడపడంలో నేర్పరైన వడ్డిగూడెం బోట్‌ వెంకన్నను పిలిపించి, తోడుగా ఎన్​డీఆర్​ఎఫ్​ (NDRF) సభ్యులు మరో పడవతో వారిని అనుసరించారు. 

ఆమె ప్రాణాలు నిలిపారు : నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో విద్యుత్తు తీగలు పడవలకు తగిలే ప్రమాదం ఉందని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపేయించారు. గర్భిణితో పడవలు కూనవరం చేరాక, అక్కడ నుంచి సీఐ తన వాహనంలో కోతులగుట్ట ఆసుపత్రికి చేర్చారు. అక్కడా ఆమెకు పూర్తిస్థాయి వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. మళ్లీ సోమవారం ఉదయాన్నే ఆమెను ఎన్​డీఆర్​ఎఫ్​ పడవలపై కొంతదూరం, వాహనంలో ఇంకొంత దూరం తీసుకెళ్లి, చింతూరు ప్రాంతీయ వైద్యశాలలో చేర్చారు. అక్కడ అప్పటికే అన్నీ సిద్ధం చేసిన వైద్యుడు కోటిరెడ్డి శస్త్రచికిత్స చేయగా భవానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లీ, బిడ్డలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జమాల్‌బాషా పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details