పర్చూరు ఎమ్మెల్యేపై నల్లధనం కేసు - వైసీపీ కుట్ర అంటున్న టీడీపీ - పోలీసులు కేసు నమోదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:43 PM IST
Police Registered The Case Against MLA YELURI: నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కంపెనీ ఉద్యోగులు బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పర్చూరు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఏలూరితో పాటు కంపెనీ ఉద్యోగులపై కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123, 171-ఇ, ఐపీసీ 120, 155(2)సీఆర్పీసీ కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మిగతా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు.
సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేయటంపై టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి ఆయనకు మద్దతుగా నిలిచారు. నిజంగా ఏలూరి అక్రమాలకు పాల్పడితే మరి ఇన్నాళ్లు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో వైసీపీ నాయకుల అక్రమాలను అడ్డుకున్నందుకే ఏలూరిపై కక్ష సాధింపులకు దిగారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. నోవా అగ్రి టెక్ లిమిటెడ్ సంస్థను 15 ఏళ్ల కిందట ఏలూరి స్థాపించారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన దాని నుంచి బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం పలువురు డైరెక్టర్ల ఆధీనంలో ఆ సంస్థ నడుస్తోందని తెలిపారు. నోవా గ్రూపు ఐపీఓలో అడుగుపెట్టినందుకే దాడుల పేరుతో సంస్థ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఎమ్మెల్యే డోల పేర్కొన్నారు.