స్పీకర్లలో ద్రవరూప గంజాయి తరలింపు- రెండు లీటర్లు స్వాధీనం - జీప్ స్పీకర్లలో గంజాయి తరలింపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 12:22 PM IST
Police Arrest Four People Transport Ganja in Jeep Speakers: పోలీసులను బురిడి కొట్టించి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను ఏ విధంగా తరలించాడో అదే తరహాలో గంజాయిని రవాణా చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న అంబులెన్స్‌లో, నేడు ఏకంగా ఓ ప్రైవేట్ జీప్ స్పీకర్లలో గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల కేంద్రం వద్ద ద్రవరూప గంజాయి తరలిస్తున్న దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇది పట్టుబడిందని తెలిపారు. ఓ ప్రైవేటు జీపు స్పీకర్లలో తరలిస్తున్న ద్రవరూప గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులతో సహా స్పీకర్లలో అమర్చిన రెండు లీటర్ల లిక్విడ్ గంజాయి, జీపు, 12వేల నగదు, చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు కేరళకు చెందిన వారిగా మరో ఇద్దరు అనకాపల్లి జిల్లాకు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.