యానాంలో పెంపుడు జంతువుల ప్రదర్శన - ఆకట్టుకున్న విన్యాసాలు - యానాంలో జంతు ప్రదర్శన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 7:15 PM IST
Pets Exhibition in Yanam: కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో వివిధ రకాల జాతుల జంతువులను వాటి యజమానులు ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఈ ప్రదర్శనను యానాం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తిలకించారు. ఈ ప్రదర్శనలో విదేశీ జాతికి చెందిన ఓ కుక్క చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వాటిని న్యాయ నిర్ణేతలు పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు. ఈ ప్రదర్శనలో గెలిచిన జంతువుల యజమాన్యులకు డిప్యూటీ కలెక్టర్, శ్రీనివాస్ బహుమతులు అందజేశారు.
ఇదే విధంగా గతంలో పెత్తందారులు పెంపుడు జంతువులు, భూస్వాములు పాడి పశువులను పెంచుకునేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో ఏదో ఒక పెంపుడు జంతువు ఉంటుంది. పట్టణాల్లో అయితే వారి స్థాయిని బట్టి విదేశీ జాతుల కుక్కలను పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలు, కోళ్లు, మేకలు, గొర్రెలతోపాటు సంకరజాతి ఆవులను జంతు ప్రేమికులు పెంచుతున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు జంతువులను పెంచుతూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని మరింత ఉత్తేజపరిచేందుకు ఇటువంటి పోటీలను కూడా నిర్వహిస్తుంది.