రాయదుర్గంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు - ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా! - NIA Raid Retired Head Master
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 2:10 PM IST
NIA Raid Retired Head Master House in Anantapur District : అనంతపురం జిల్లాలో ఎన్‌ఐఏ (NIA - National Investigation Agency) సోదాలు కలకలం రేపుతున్నాయి. రాయదుర్గంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అబ్దుల్ గఫూర్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం రావడంతో అబ్దుల్ గపూర్ ఇంట్లో సోదాలు చేశారు.
అబ్దుల్ గపూర్ కుమారులు గత కొంతకాలంగా కనిపించకపోవడంతో ఇవాళ వారి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. రాయదుర్గంలో మూడు రోజులుగా ఎన్‌ఐఏ అధికారులు రెక్కి నిర్వహించారు. సాయుధ దళాల సహాయంతో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దాక్కున్న అబ్దుల్ గఫూర్ కుమారుడు సోయేల్‌ను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో ఉన్న లింకులపై సోయేల్‌ను విచారించి కేసు నమోదు చేశారు. సోయేల్‌ను తమతో పాటు బెంగళూరుకి తీసుకెళ్తున్నట్లు అతని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. సాయంత్రం బెంగళూరు కార్యాలయానికి రావాలని సోయేల్ కుటుంబానికి ఎన్‌ఐఏ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.